దిల్లీ: భారత్‌లో ఫేస్‌బుక్‌కు పోటీగా సామాజిక అనుసంధాన వేదికను సిద్ధం చేస్తున్నట్లు ట్రూఇండియన్ అనే సంస్థ వెల్లడించింది. ‘ట్రూ ఇండియన్’ పేరుతో ఆవిష్కృతమవుతున్న ఈ సామాజిక అనుసంధాన వేదికను బిహార్ ఆర్థిక మంత్రి జగ్గంత్ మిశ్ర కుమారుడు మనీశ్ మిశ్ర నేతృత్వంలోని సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేశారు. భారత్‌లోని భిన్నత్వం, సమానత్వ భావనలను తమ వేదిక ప్రతిబింబిస్తుందని ట్రూ ఇండియన్ ఓ ప్రకటనలో తెలిపింది. మదుపరులు, వ్యవస్థాపకులకు కేవలం లాభాలు అర్జించి పెట్టేందుకే ఫేస్‌బుక్ పనిచేస్తోందని ట్రూ ఇండియన్‌ను ప్రారంభించనున్న దాతృత్వ సంస్థ ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ ఆరోపించింది. ఫేస్‌బుక్‌ను 19వ శతాబ్దంలో దేశాన్ని దోచుకున్న ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో పోల్చింది. సామాజిక అనుసంధాన వేదిక ‘ఆర్కుట్’ను ఫేస్‌బుక్ ఏ విధంగా మూలకు నెట్టిందో.. తాము కూడా అలానే మరో ఐదేళ్లలో భారత్‌కు ఫేస్‌బుక్ నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొంది.